మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు : జయహో బీసీ మహాసభలో సీఎం
CM YS Jagan Speech In Jayaho BC Meeting. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ
By Medi Samrat Published on 7 Dec 2022 9:08 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభలో ప్రసంగించారు. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్‌లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు అంటూ చెప్పడంతో సభలో ఒక్కసారిగా అందరూ చప్పట్లతో మారుమ్రోగించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయని అన్నారు.
బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పానని.. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చామన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చామని.. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారన్నారు.
టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని.. మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారని చెప్పారు సీఎం జగన్. రాజ్యసాధికారికతకు బీసీలు నిదర్శనంగా నిలిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెప్పండని బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు.
ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబుకు గుర్తు చేయండి. చేసిన మోసాలను, నయవంచనను గుర్తు చేయండి. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పండని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.
2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలన్నారు. మానవతా వాదానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. 2024లో ఇంతటికి మించిన గెలుపు ఖాయమని చెప్పండని బీసీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు.