'రాక్షసులతోనే మన యుద్ధం'.. బాబు, పవన్‌లపై జగన్ తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం వైఎస్ జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 28 Jun 2023 3:20 PM IST'రాక్షసులతోనే మన యుద్ధం'.. బాబు, పవన్‌లపై జగన్ తీవ్ర విమర్శలు
ఏపీ సీఎం వైఎస్ జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చే పేటెంట్ ప్యాకేజీ స్టార్ కే ఉందన్నారు. కురుపాంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తుంటే.. కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించని దత్తపుత్రుడు.. ఇప్పుడు లారీ ఎక్కి రాష్ట్రంలో తిరుగుతూ ప్రశ్నిస్తున్నాడని మండిపడ్డారు.
''14 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండికూడా ఏమీచేయని ఓ నాయకుడు.. ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల కిందట పుట్టిన ఓ దత్తపుత్రుడు.. వీళ్లు టీడీపీ అనే తినుకో, దోచుకో, పంచుకో అనే పార్టీతో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ, బొజ్జలు పెంచుకుంటూ, బొజ్జ రాక్షసుల్లా పత్రికలు, వారి టీవీలు.. ఇవన్నీ కూడా మనల్ని విమర్శిస్తున్నాయి.'' వీటిపై ప్రజలు ఆలోచన చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఓ లారీ.. దానిపేరు వారాహి అట.. అది ఎక్కి మామూలుగా కూడా మాట్లాడడు, ఊగిపోతూ మాట్లాడుతుంటాడు అంటూ పవన్‌కు సెటైర్ వేశారు. తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం, తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపిస్తాడు. తాటతీస్తానంటాడు.. ఈ మనిషికి మాటకు నిలకడ లేదు, మనిషికీ నిలకడ లేదు అంటూ పవన్ కల్యాణ్ పై జగన్ మండిపడ్డారు.
సమజాన్ని చీల్చడమే దుష్టచతుష్టయం పని అన్నారు. మన పనాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయని, పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో మన పునాదులు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. పేదల కష్టాల నుంచే మన పునాదులు పుట్టాయన్నారు. వారి మాదిరిగా వెన్నుపోటు, అబద్ధాలపై మన పునాదులు పుట్టలేదన్నారు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, యుద్ధంలో వారి మాదిరిగా మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు లేవన్నారు. యుద్ధంలో వారి మాదిరిగా దత్తపుత్రుడు కూడా లేడన్నారు. తనకు అండగా ఉంది ఆ భగవంతులు, ప్రజలు మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. మంచి చేశానని అనిపిస్తే ఈ యుద్ధంలో మీరే (ప్రజలు) అండగా నిలవాలని సీఎం జగన్ కోరారు.