ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకురావాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు తీసుకురావల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే.. హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కిందకు హాస్టళ్లు, గురుకులాలు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని అన్నారు. మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో.. ఆ స్ధాయిలో నిర్వహణ ఉండాలని.. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.