నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలి

CM YS Jagan Review Externally Aided Projects. ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on  9 Sep 2022 11:05 AM GMT
నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలి

ఈఏపీ (ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌)పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో న్యూడెవలప్‌మెంట్‌ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణసహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లు ఖర్చుచేస్తుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా వివిధ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువుల అనుసంధానం :

రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వల ద్వారా అనుసంధానం చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఒకవేళ అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని.. ఈ చెరువులన్నింటినీ కూడా గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని.. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందని సీఎం అన్నారు.

చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని సీఎం అధికారుల‌కు వివ‌రించారు. ఒక సమగ్రమైన అధ్యయనం చేసి, ఈప్రాజెక్టును చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో దీన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. పనులు పూర్తిచేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు.. పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నాం. వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కాబట్టి.. వాటి పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం అన్నారు.


Next Story