దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

CM YS Jagan Presented Silk Clothes Durgamma. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గ

By Medi Samrat  Published on  12 Oct 2021 11:51 AM GMT
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మ‌వారికి సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. తొలుత ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సామినాయుడు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ భ్రమరాంబ ఇతర అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో వుండి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్ దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాచన మండపంలో పండితులు ముఖ్యమంత్రికి వేద‌ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ త‌దిత‌రులు ఉన్నారు.


Next Story