అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం : సీఎం జగన్

CM YS Jagan New Districts Launch. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఇవాళ మంచి జరిగే గొప్ప రోజని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

By Medi Samrat  Published on  4 April 2022 10:56 AM IST
అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం : సీఎం జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఇవాళ మంచి జరిగే గొప్ప రోజని సీఎం వైఎస్ జగన్ అన్నారు.కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీలో ఇవాళ్టి నుంచి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలన సాగుతుంద‌ని అన్నారు. ఇవాళ్టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ 26 జిల్లాల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడిందని.. 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ప్రాంరంభ‌మైంద‌ని.. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలని నొక్కిచెప్పారు. గతంలో ఉన్న జిల్లాలు యథాతథంగానే ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 4.96 కోట్ల మంది జనాభాలో.. సగటున జిల్లాకు 38.15 లక్షల మంది జనాభా ఉన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇకపై జిల్లాకు సగటున 19.07 లక్షల మంది జనాభా ఉంటార‌ని అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకే మార్పులు చేశామ‌ని అన్నారు.

అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం : సీఎం జగన్గడిచిన మూడేళ్లుగా పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరిగిందని.. గ్రామస్థాయి నుంచి మార్పు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు. గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పని చేస్తున్నామ‌ని చెప్పారు. కోటి 19 లక్షల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలియ‌జేశారు. రేషన్‌ను ఇంటింటికీ తీసుకెళ్లి అంద‌జేస్తున్న ప్రప్రథమ ప్రభుత్వం మనదేన‌ని తెలిపారు. వాలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతున్నలకు మేలు చేస్తున్నామ‌ని.. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశామ‌ని తెలియ‌జేశారు. పరిపాలనలో మౌలిక మార్పులు, సంస్కరణలు ఇవన్నీ ఉదహరణలని తెలియ‌జేశారు. గ్రామ స్థాయి నుంచి రెవిన్యూ, జిల్లా స్థాయి వరకు మార్పులు అవసరమ‌ని.. అందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామ‌ని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

Next Story