ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ ప్రకటన చేసిన సీఎం జగన్.. వివరాలివే..
CM YS Jagan Mohan Reddy Announced PRC. ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
By Medi Samrat Published on 7 Jan 2022 5:47 PM ISTఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్ డీఏలు ఉండకూడదని స్పష్టం చేశానని అన్నారు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించానన్నారు. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.