గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: సీఎం జగన్ కీలక ప్రకటన

వైజాగ్ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ - 2023 వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు.

By అంజి  Published on  3 March 2023 8:12 AM GMT
CM YS Jagan, Global investers summit

వైజాగ్ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో సీఎం జగన్

వైజాగ్ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ - 2023 ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల విలువ చేసే 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలగనుందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ ప్రసంగించారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగ మారిందన్నారు. ఏపీలో క్రీయాశీలక ప్రభుత్వం ఉందన్నారు. త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కానుందని, త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని తెలిపారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నామని సీఎం తెలిపారు.

భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని, రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం అమల్లో ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. అందులో 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోనే ఉన్నాయన్నారు. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో నెంబర్‌ వన్‌గా నిలిచామని సీఎం జగన్ పేర్కొన్నారు.

విశాఖలో ఇన్వెస్టర్స్ సుమ్మిట్ జరగడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టామని తెలిపారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు ఉన్నాయని తెలిపారు. తొలి రోజే 92 ఎంవోయూలు, మొత్తం రూ.13 లక్షల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్‌ వివరించారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారని తెలిపారు. మిగతా ఎంవోయూలు రేపు జరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రీన్‌, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని సీఎం జగన్ తెలిపారు.



Next Story