గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 : అతిథుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జిఐఎస్ జ‌ర‌గ‌నుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 2:40 AM GMT
Global Investors Summit 2023, Visakhapatnam

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు

విశాఖపట్నం : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)కు స‌ర్వం సిద్ద‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా రెండు రోజుల పాటు ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో నేడు(శుక్ర‌వారం), రేపు(శ‌నివారం) ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. జిఐఎస్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారమే విశాఖపట్నం చేరుకున్నారు.

విశాఖ చేరుకున్న సీఎం జ‌గ‌న్‌

వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హిస్తున్న తొలి ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సుకు దేశ‌, విదేశాల‌కు చెందిన పారిశ్రామికవేత్త‌లు, పెట్టుబ‌డిదారులు, వివిధ దేశాల రాయ‌బారులు, వాణిజ్య ప్ర‌తినిధులు దాదాపు 8 నుంచి 10 వేల మంది వ‌ర‌కు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు అవుతార‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 3న జరిగే సమ్మిట్‌ ప్రారంభ సెషన్‌లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్ లు కీలక ప్రసంగం చేస్తారు. రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమారమంగళం బిర్లా, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత జి.మల్లికార్జునరావు త‌దిత‌ర పారిశ్రామిక దిగ్గ‌జాలు ఈ స‌ద‌స్సులో పాల్గొంటారు.


“ప్రభుత్వ విజన్ ప్రకారం.. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్, ఫార్మాస్యూటికల్, మెడికల్ పరికరాలు మరియు ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యం, ఆటోమొబైల్ మరియు ఎలక్ట్రిక్ వాహనం, MSME, టెక్స్‌టైల్ మరియు టూరిజం వంటి 14 రంగాలపై దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని, పెట్టుబడిదారుల సమావేశానికి ఇదే సరైన సమయమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. స‌ద‌స్సులో రూ.3ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు జ‌రుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

మొద‌టి రోజు సదస్సు నిర్వహణ ఇలా..

- శుక్రవారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 118 స్టాల్స్‌తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు.

- భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.50 వరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధన వనరులు- గ్రీన్‌ హైడ్రోజన్‌, వాహనరంగం- విద్యుత్‌ వాహనాలు, అంకుర సంస్థలు-నవకల్పనలు, ఆరోగ్య రంగం- వైద్యపరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, వ్యవసాయం-ఆహారశుద్ధి, ఏరోస్పేస్‌-రక్షణ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు.

-పెట్టుబడి దారుల సదస్సులో పలువురు పారిశ్రామిక ప్రముఖులతో సీఎం జగన్‌, రాష్ట్ర మంత్రులు సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. తొలిరోజు సదస్సు ముగిసిన తర్వాత సాగర తీరంలోని ఎంజీఎం పార్కులో పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులకు ముఖ్యమంత్రి విందు ఇస్తారు.


రెండో రోజు ఒప్పందాలు..

- రెండో రోజు సదస్సులో ఉదయం 9.30 నుంచి 10.30 వరకు ఏపీలో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరుగుతాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌, ఉన్నతవిద్య, పర్యాటక, ఆతిథ్య రంగాలు, నైపుణ్యాభివృద్ధి, జౌళి, దుస్తులు, ఔషధాలు, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగుస్తుంది.


పెట్టుబడిదారుల సదస్సుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

ఐదు హాళ్లు, 130 స్టాళ్లు

సమ్మిట్‌లో జర్మన్ హ్యాంగర్‌లతో కూడిన ఐదు పెద్ద హాల్స్ మరియు 14 విభిన్న వ్యాపార రంగాలకు చెందిన 130 ప్రత్యేక స్టాల్స్ ఉంటాయి. ప్రతి హాలులో ప్రభుత్వం నుండి వ్యాపారం (G2B) సమావేశాలు, మీడియా సమావేశాలు, ప్రతినిధుల కోసం డైనింగ్ హాళ్లు, సెమినార్‌లు, సమావేశాలు మరియు విశ్రాంతి గదులు వంటి విభిన్న ఈవెంట్‌లు ఉంటాయి.

· హాల్ 1లో భోజన సౌకర్యం ఉంటుంది.

· హాల్ 2లో వివిధ కేటగిరీల కింద పెట్టుబడిదారుల 130 స్టాల్స్ ఉంటాయి.

- హాల్ 3 ఒక సమావేశ మందిరం.

· హాల్ 4 VVIPS, CMల సమావేశ మందిరం, CM బోర్డు గది మరియు ప్రధాన కార్యదర్శి గదికి అంకితం చేయబడింది.

· హాల్ 5 ప్రత్యేకంగా సెమినార్లు మరియు సిబ్బందికి సేవా గదులు.


ప్రత్యక్ష ప్రసారం

విశాఖపట్నం ప్రజలు VMRDA పార్క్ మరియు బీచ్ రోడ్‌తో సహా బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లపై రెండు రోజుల సమ్మిట్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ఆంధ్ర వంటకాలు

గుత్తి వంకాయ్ కూర నుంచి బొమ్మిడాల పులుసు వరకు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అతిథులకు నోరూరించే ఆంధ్రా వంటకాలు ఉంటాయి. అసలైన ఆంధ్రా ఆహారాన్ని రుచి చూసే వారికి ఇది ఒక ట్రీట్ అవుతుంది. కొన్ని వంటలలో ఉలవచారు, చికెన్ ఫ్రై, టొమాటో పప్పు, రొయ్యల పులుసు మరియు ప్రత్యేక పొడిలు ఉన్నాయి. రెండు రోజుల్లో వేరే మెనూ ఉంటుంది.

బహుమతులు..

GIS 2023 కోసం అతిథులకు తేనె, ఇన్‌స్టంట్ కాఫీ ప్యూర్, ఇన్‌స్టంట్ కాఫీ బ్లెండ్, కాఫీ కాల్చిన బీన్స్, జీడిపప్పు, నల్ల మిరియాలు, పసుపు పొడి, ఉసిరికాయ మిఠాయి, సోప్‌నట్ హెయిర్‌వాష్, సోప్‌నట్ హ్యాండ్‌వాష్, హెర్బల్ పెయిన్‌తో సహా 12 రకాల గిరిజన ఉత్పత్తులతో కూడిన బహుమతి హాంపర్‌లు ఇవ్వబడతాయి.


Next Story