మా విజయాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఓ మీడియా సామ్రాజ్యం : వైఎస్ జగన్

CM YS Jagan Fires On Media. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలపై స్పందించారు

By Medi Samrat  Published on  20 Sep 2021 7:32 AM GMT
మా విజయాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఓ మీడియా సామ్రాజ్యం : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలపై స్పందించారు. తమను ప్రజలు మరోసారి దీవించారని చెప్పుకొచ్చారు. అయితే తమ విజయంపై కొన్ని మీడియా సంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఓ పత్రికను చూపించి మరీ ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని.. పరిషత్‌ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 99 శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

ఓ మీడియా సంస్థపై జగన్ విమర్శలు:

ఈ సమావేశంలో సీఎం జగన్ ఓ మీడియా సంస్థపై విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం​ ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. 'నిజంగా ఇది పేపరా.. పేపర్ కు పట్టిన పీడనా' అంటూ ఓ హెడ్ లైన్ ను చదువుతూ వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇలాంటి పేపర్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని విమర్శలు గుప్పించారు. పార్టీ సింబల్ తో జరిగిన ఎన్నికల్లో కూడా తాము అద్భుతమైన విజయం సాధించామని.. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికల్లో ప్రజలు దీవిస్తే దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి కొన్ని మీడియా సంస్థలు అని విమర్శించారు వైఎస్ జగన్.



Next Story