పవన్ కళ్యాణ్ హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను "హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్" అని విమర్శించారు.
By అంజి Published on 17 May 2023 12:44 PM IST
పవన్ కళ్యాణ్ హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను "హోల్‌సేల్ ప్యాకేజీ స్టార్" అని విమర్శించారు. 2019లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయినా, ఇప్పుడు తన షూటింగ్ షెడ్యూల్‌ల మధ్య స్టాప్-గ్యాప్ రాజకీయ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. జనసేన పార్టీ (జెఎస్‌పి) నాయకుడిని తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకి "పెంపుడు కొడుకు" అని పిలుస్తూ, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు.
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 175 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసే దమ్ము టీడీపీ, జనసేనలకు లేదని, అయితే రాజకీయ మనుగడ కోసం పొత్తులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండో స్థానం కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబుకి వెన్నుపోటు, రాజకీయ పొత్తులు, కుట్రలు, జిమ్మిక్కులు మాత్రమే తెలుసునని, తన పెంపుడు కొడుకు పవన్ కళ్యాణ్ సప్తవర్ణాల మాటలకు చిలుక పలుకులు పలుకుతూ ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తున్నారని, కొత్త రాజకీయ పొత్తులు పెట్టుకుని ఇష్టానుసారంగా విడిపోయేందుకు సిద్ధమయ్యారని ముఖ్యమంత్రి అన్నారు.
ఎన్నికల వేళ మాత్రమే నాయుడుకు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు గుర్తుకొస్తారని, రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా పవన్ కల్యాణ్ నాయుడుకు సెకండ్ ఫిడేలు వాయిస్తున్నారని, టీడీపీ, జనసేనలకు రాజకీయంగా విశ్వసనీయత లేదని వ్యంగ్యంగా అన్నారు. “స్నేహపూర్వక మీడియా” సహాయంతో.. వారు జగన్‌పై కాకుండా ప్రజలపై యుద్ధం చేస్తున్నారని, “వారి మోసపూరిత డిజైన్ల” పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
''తానే ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని చేశానని చెప్పుకోవడంలో టీడీపీ అధినేత ఎప్పుడూ విసిగిపోరు. కానీ, ఆయన 14 ఏళ్ల పాలన గురించి ఆలోచిస్తే ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకు రావడం లేదు. బదులుగా, వెన్నుపోటు పొడిచి, మోసం చేసే స్వభావం మాత్రమే గుర్తుకు వస్తుంది'' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ''ప్రతిపక్ష నేతగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని, ముఖ్యమంత్రిగా అక్కడే ఉంటున్నాను. అయితే నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ప్యాలెస్‌ను నిర్మించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడే నివసిస్తున్నారు. ఆయన పెంపుడు కొడుకు కూడా రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీకి, ప్రతిపక్షాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి'' అని ప్రజలను కోరారు.
ఇరుకు సందుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో తొక్కిసలాటలో మరణించిన వారిపై కూడా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పట్టింపు లేదని, ఆయన పెంపుడు కొడుకు ప్యాకేజీలతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి వారిద్దరూ అసూయపడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు రూ.2,10,000 కోట్లు ఖర్చు చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిందని చెప్పారు.