మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్‌

మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

By అంజి
Published on : 24 April 2024 6:22 PM IST

CM YS Jagan, AP people, elections, APPolls

మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్‌

మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు. తనకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని, డబుల్‌ సెంచరీ కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. ఈ ఎన్నికలు ప్రతీ ఒక్కరి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, పెత్తందారుల ముఠాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ ప్రజలను కోరారు. కరోనా కాలంలోనూ బటన్లు నొక్కడం అపలేదని సీఎం జగన్‌ తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి డెలివరీ చేసిన చరిత్ర తమదని అన్నారు. రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు పంచామన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న 99 శాతం హామీలు నెరవేర్చామన్నారు.

చంద్రబాబుకు రోజూ తనను తిట్టడమే పని అని, చంద్రబాబు లాంటి మోసగాళ్లు కావాలా? జగన్‌ లాంటి నిజాయితీపరుడు కావాలా? అని ప్రజలను తేల్చుకోవాలని కోరారు. సొంత బలం లేక పొత్తుల డ్రామా ఆడే నాయకుడు కావాలా? లేదా మంచి చేసి, ఆ చేసిన మంచిని చూపించే, సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? అనేది తేల్చుకోవాలని సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు.. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చివరి సిద్ధం సభతో ఈ యాత్ర ముగిసింది. కాగా రేపు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌ నామినేషన్‌ వేయనున్నారు.

Next Story