సతీమణితో కలిసి రేపు లండర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయల్దేరి వెళ్లనున్నారు.
By - Knakam Karthik |
సతీమణితో కలిసి రేపు లండర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
అమరావతి: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయల్దేరి వెళ్లనున్నారు. నవంబరు 4 తేదీన ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ లండన్ లో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందించనుంది. అలాగే, హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అదే వేదికపై అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును సంస్థ ఆమెకు అందించనుంది. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, హీరో ఎంటర్ ప్రైజెస్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సులో హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలోనూ భువనేశ్వరి గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడీ ఎంపిక చేసింది.
పారిశ్రామిక వేత్తలతో సీఎం భేటీలు
లండన్ లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరుగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి లండన్ లోని పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రవాసాంధ్రులతోనూ సీఎం భేటీ కానున్నారు. నవంబరు 6 తేదీన సీఎం తిరిగి రానున్నారు.






