డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకం తెస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నెల 4న ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తామని.. దాదాపు 2.90 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని వివరించారు. ఈ పథకం అమలుకు ఏడాదికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఒక్కో రైతుకూ రూ.20,000 ఇస్తున్నాం. సూపర్ సిక్స్ లో మొదటి హామీ మెగా డీఎస్సీ. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఏడాదికే టీచరు పోస్టులు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు నేను అండగా ఉంటాను. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇప్పటికే 5,500 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశాం అని ముఖ్యమంత్రి తెలిపారు.