మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం సమీక్ష

CM review on women and child welfare department. మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on  26 Sep 2022 10:06 AM GMT
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం సమీక్ష

మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. అలాగే.. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై కూడా సీఎం సమీక్షించారు. స్కూళ్లలో టాయిలెట్ల మెయింటెనెన్స్‌ కోసం ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణకోసం ఏర్పాటుచేసిన ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. అంగన్‌వాడీలకు కూడా ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటుచేయాలన్నారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి పగడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలని.. అన్నీకూడా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ ఉండాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం అన్నారు.

పంపిణీలో కూడా అక్కడక్కడా లోపాలు తలెత్తుతున్న సమాచారం నేపథ్యంలో పగడ్బందీ విధానాలు అమలు చేయాలని.. నాణ్యతను పూర్తిస్థాయిలో చెక్‌చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలని సీఎం అన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్‌ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలన్న సీఎం.. కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందని.. అందుకనే లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్‌ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని సీఎం తెలిపారు.

అన్ని అంగన్‌వాడీలకు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీచేయాలన్న సీఎం అధికారుల‌కు జారీ చేశారు. ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. ఈ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలుపై పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అంగన్‌వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్‌వాడీలో ఉంచాలని సీఎం ఆదేశించారు. పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పగించాలన్నారు.

సెప్టెంబరు 30 కల్లా అంగన్‌వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని అధికారులు సీఎంకు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాను వెల్లడిస్తామని అధికారులు వెల్ల‌డించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అవసరమనుకుంటే.. తమ ఆన్సర్‌షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబరు 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్ల‌డించారు.





Next Story