ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్ర‌బాబు ఆస్తులు.. మ‌రి సీఎం సంపద..?

గత ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి.

By Medi Samrat  Published on  12 May 2024 3:56 AM GMT
ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్ర‌బాబు ఆస్తులు.. మ‌రి సీఎం సంపద..?

గత ఐదేళ్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి. చంద్ర‌బాబు సంపద దాదాపు 39 శాతం పెరిగితే.. సీఎం జగన్ సంపద 2019 నుంచి 2024 వరకు దాదాపు 48 శాతం పెరిగింది.

కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న‌ టీడీపీ అధినేత‌ చంద్రబాబు ఆస్తులు రూ.263.26 కోట్లు పెరిగినట్లు ప్రకటించినట్లు స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ సంస్థ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అభ్యర్థుల సంపదను విశ్లేషించింది. 2019లో రూ. 668.57 కోట్లు ఉండ‌గా.. 2024లో రూ. 931.83 కోట్లుగా పేర్కొంది.

పర్చూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు ఆస్తులు రూ.253.90 కోట్లు పెరిగాయి. 2019లో రూ. 41.90 కోట్లు ఉండ‌గా.. 2024లో రూ. 295.80 కోట్లకు పెరిగాయి.

పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆస్తులు రూ.247.26 కోట్లు పెరిగాయి. 2019లో రూ. 510.38 కోట్ల నుంచి 2024లో రూ.757.65 కోట్లకు పెరిగాయి.

ఎమ్మెల్యేల ఆస్తులపై విశ్లేషణ

ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న 134 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను ఏడీఆర్ విశ్లేషించింది. 123 మంది ఎమ్మెల్యేల (92%) ఆస్తులు 1 శాతం నుంచి 973 శాతానికి పెరిగాయని.. 11 మంది ఎమ్మెల్యేల((8%) ఆస్తులు -2 శాతం నుంచి -50 శాతం వ‌ర‌కూ తగ్గాయని అధ్యయనం వెల్ల‌డించింది.

ఎన్నికల అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ల డేటా ప్రకారం.. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్థులలో గుంటూరుకు చెందిన టీడీపీకి అభ్య‌ర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5,785.28 కోట్ల ఆస్తులతో ఉన్నారు. పెమ్మసాని వృత్తిరీత్యా వైద్యుడు. వివిధ వ్యాపారాలలో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మే 13న జరగనుంది.

2019 ఎన్నికల తర్వాత ఆస్తుల మార్పుల సంక్షిప్త అవలోకనం ఇక్కడ ఉంది:

2019 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తులు: 2019లో వివిధ పార్టీలు తిరిగి పోటీ చేసిన 134 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు విలువ రూ. 31.39 కోట్లు.

2024 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తులు: 2024లో మళ్లీ పోటీ చేస్తున్న 134 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు విలువ రూ.49.40 కోట్లు.

5 సంవత్సరాలలో సగటు ఆస్తుల వృద్ధి (2019-2024): 2019, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మధ్య తిరిగి పోటీ చేస్తున్న 134 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు వృద్ధి రూ.18 కోట్లు.

ఐదేళ్లలో వృద్ధి శాతం (2019-2024): మళ్లీ పోటీ చేస్తున్న 134 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు వృద్ధి 57 శాతం.

Next Story