ఆర్ అండ్ బి శాఖపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan's review of R&B department. ఆర్ అండ్ బి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Jan 2023 4:56 PM ISTఆర్ అండ్ బి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలి. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత.. మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్ అవుతాయి. నిర్వహణకూడా సజావుగా, నాణ్యతతో సాగుతుంది. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలని అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీని వాడాలని అధికారులు ప్రతిపాదించగా.. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని సీఎం అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
కడప, బెంగళూరు రైల్వేను లైనుపై, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు చెప్పారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి. ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలి. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలి. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయి. వారి కడుపుమంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సూచించారు.