ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM ISTఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 2023లో ఖరీఫ్‌లో ఏర్పడిన కరవుతో పాటు తుఫానుతో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1294.58 కోట్లు అందించనున్నారు. గత ఐదేళ్లలో 34 లక్షల మంది రైతులకు రూ.3262 కోట్ల సబ్సిడీ అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించారు. ఇప్పుడు మరోసారి రైతులకు సాయం అందిస్తున్నారు.
గత సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాభావం కారణంగా 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు పండాయి. అలాగే మిచౌంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర సర్కార్ గుర్తించింది. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని ప్రభుత్వం అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్‌లో 5 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం లెక్క తేల్చింది.