మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
CM Jagan will visit Kadapa district for three days. సీఎం జగన్ జూలై 8 నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు.
By Medi Samrat
సీఎం జగన్ జూలై 8 నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం చేరుకుంటారు. దివంగత రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో నివాసానికి చేరుకుంటారు.
వైయస్సార్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండికోట చేరుకుంటారు. గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణపనులకు శంకుస్ధాపన చేస్తారు. వ్యూ పాయింట్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని.. గరండాల కెనాల్ డెవలప్‌మెంట్ ఫేజ్ –1 పనులను ప్రారంభిస్తారు. అనంతరం పులివెందులలో నూతనంగా నిర్మించిన (వైఎస్‌ఆర్ ఐఎస్‌టిఏ) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయో సైన్సెస్ ను.. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేస్తారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకుంటారు.
మూడోరోజూ పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళతారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేస్తారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.