ఏపీలో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం.. నేడు ఓ చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దేశచరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఒకేసారి 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. తాజాగా వారందరికీ రెండు విడతల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా నేడు మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ఇక మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల గృహాలు.. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి పూర్తికానుండగా.. రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అన్ని వసతులతో ఇళ్ళు ఇవ్వడమే కాకుండా.. అన్ని అధునాతన మౌలిక సదుపాయాలతో తొలి దశలో 8,905, రెండో దశలో 8,100 అందమైన వైఎస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తోంది.