ఆంధ్రప్రదేశ్ క‌డ‌ప జిల్లాకు చెందిన దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా భూ క‌బ్జా విష‌యంలో న్యాయం కావాల‌ని.. న్యాయ జ‌ర‌గ‌ని ప‌క్షంలో కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం త‌ప్ప వేరే దిక్కు లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ సెల్ఫీ వీడియోను అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. బాషా త‌నకు 2009లో దాన విక్ర‌యం కింద ఒకటిన్నర ఎకరం భూమి రిజిస్ట‌ర్ అయ్యింద‌ని.. దాని మీద కోర్టు కేసు న‌డుస్తోంద‌ని తెలిపారు. ఆ భూమిని లాక్కోవ‌డానికి తిరుపాల్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సీఐని క‌లిసి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తార‌ని సూచించార‌ని తెలిపారు.

న్యాయం చేస్తా అన్న సీఐ ఇప్పుడు వేరే వారికి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఆరోపించారు. తాను చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని సీఐ బెదిరించ‌డాని ఆరోపించారు. తనను కొట్టి తన భార్యను స్టేషన్ నుంచి బయటికి గెంటించేశారని వివరించారు. మ‌మ్మ‌ల్ని చంపి మా భూములు లాక్కోండ‌ని వాపోయాడు. పోలీసుల నుండి తనకు ప్రాణహాని ఉందని.. తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యే శరణ్యం అని అక్బర్ బాషా మీడియాతో కూడా చెప్పుకొచ్చాడు. మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి ఎలా పడితే అలా తనతో మాట్లాడాడని అక్బర్ బాషా చెప్పుకొచ్చాడు.

ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైందని తెలుస్తోంది. అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించిందని మీడియా ముఖంగా అక్బర్ బాషా తెలిపాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైందని బాధితుడు అక్బర్‌ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం జగన్‌ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని తెలిపాడు.


సామ్రాట్

Next Story