నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం : సీఎం జ‌గ‌న్‌

గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

By Medi Samrat  Published on  8 Aug 2023 2:15 PM GMT
నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం : సీఎం జ‌గ‌న్‌

గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, పి.గన్నవరం లంక గ్రామాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటవరకూ ఆయా గ్రామాల్లో ముమ్మరంగా పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గురజాపులంకలో ప్రారంభమైన సీఎం పర్యటన తర్వాత కూనలంక, లంక ఆఫ్‌ ఠానేలంక గ్రామాల్లో సాగింది.

ఆ తర్వాత సీఎం దీనికి సమీపంలోనే ఉన్న పి.గన్నవరం నియోజకవర్గం కిందకు వచ్చే కొండకుదురులంక, పొట్టిలంక గ్రామాల్లో పర్యటించారు. కూనలంక, లంక ఆఫ్‌ ఠానేలంక, కొండకుదురు లంకల్లో సీఎం వరద బాధితులనుద్దేశించి మాట్లాడారు. గురజాపులంక, కూనలకం, కొండకుదరు లంకల్లో గోదావరి వరద వల్ల తీవ్రంగా కోతకు గురవుతున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆవాసాలున్న ప్రాంతాల్లో భూమి కోతకు గురికాకుండా రివిట్‌మెంట్‌ (స్టోన్‌ పిచ్చింగ్‌) చేయిస్తామని ప్రకటించారు. ప్రాథమికంగా దీనికోసం రూ.150 కోట్లు అవుతుందని అంచనా వేసినప్పటికీ.. రూ.200 కోట్లైనా ఖర్చు చేయడానికి వెనుకాడమన్నారు. రెండు నెలల్లోగా పనులు ప్రారంభించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరదలు కారణంగా పంట నష్టపోయిన వారికి ఈ నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

Next Story