ఓటీఎస్ పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ, ఎర్నింగ్ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షసమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లనూ పూర్తి చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు సేవలు అందుబాటులోకి వచ్చాక.. సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కాకుండా ఇతర సేవలపైనా అవగాహన కల్పించాలని అన్నారు.
అక్టోబర్ 2న తొలి విడతలో రిజిస్ట్రేషన్ సేవలు, భూహక్కు భూరక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని అన్నారు. వెదరు పెంపకాన్ని ప్రోత్సహించండని అధికారులను ఆదేశించారు. మైనర్ మినరల్‌కు సంబంధించి కార్యక్రమాల ప్రారంభంపై దృష్టి పెట్టాలని కోరారు. ఏపీఎండీసీ సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జెన్ కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని.. బొగ్గును రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.