'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంపై సీఎం సమీక్ష
CM Jagan Review Meeting On Jaganannaku Chebudam Program. జగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
By Medi Samrat Published on 3 Feb 2023 12:08 PM GMTజగనన్నకు చెబుదాం కార్యక్రమం సన్నాహకాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశింశారు సీఎం జగన్. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్ చేయాలని సీఎం సూచించారు. అందిన అర్జీలపై ప్రతి వారం కూడా ఆడిట్ చేయాలి. దీనిపై ప్రతి వారం కూడా నివేదికలు తీసుకోవాలని చెప్పారు. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలని.. అలా అయితేనే.. కార్యక్రమం సవ్యంగా సాగుతుందని అన్నారు.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయాలని.. వివిధ విభాగాల్లో వినతుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ ఉన్న పద్ధతులను మరోసారి పరిశీలించి, తిరిగి పునర్నిర్మాణం చేయాలని ఆదేశించారు. సీఎంఓ తో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా జగనన్నకు చెబుదాం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలి. తర్వాత జిల్లాస్థాయిలోనూ, మండలస్థాయిలో కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి మానిటరింగ్ యూనిట్లు మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఉండాలని అధికారులతో అన్నారు. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. స్పందనకు అత్యంత సమర్థవంతమైన, మెరుగైన విధానమే ‘‘ జగనన్నకు చెబుదాం’’ అని సీఎం అన్నారు.
సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నది. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునర్నిర్మాణాలతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. స్పందన డేటా ప్రకారం.. అత్యధికంగా ఫిర్యాదులు రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రారంభమైన తర్వాత ఇవే విభాగాలనుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టిపెట్టాల్సి ఉంటుందని సూచించారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్ ఇవ్వాలి. మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటుపై కూడా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి. ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం. పరిష్కారం అయిన తర్వాత వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలని అన్నారు. పలానా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అక్కడ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరస్కరణకు గురైనా జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలని.. అవినీతికి సంబంధించి అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి. పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పోలీసులు, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కూడిన మండల, మున్సిపల్ స్ధాయి సమన్వయ కమిటీ ప్రతివారం సమావేశం కావాలని అన్నారు. వారంలో ఒకరోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికీ అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.