19న సీఎం జగన్ పోలవరం పర్యటన
CM Jagan Polavaram Visit On 19th July. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
By Medi Samrat
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, పోలవరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్, పోలవరం సైట్ లలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సీఎం వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్ పై చర్చించారు.
అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులతో, పోలీసు అధికారులతో పర్యటన, భద్రత చర్యలపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్, జిల్లా ఎస్పీలతో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరికి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక 2 వేల కిట్స్ ఏర్పాటు చేసి, శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
సీఎం జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని.. అక్కడ నుంచి ఉ.10.10 కి బయలుదేరి.. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలోని హెలిప్యాడ్ కు ఉ.11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి అధికారులు, కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తదుపరి అక్కడ నుంచి ఉ.11.50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరంకు మ.12.00 కి చేరుకుని మ.1.00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పోలవరం లోని సమావేశ మందిరం నుంచి మ.1.10 బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని మ.1.20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంకు చేరుకుంటారు.