కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
CM Jagan participated in Christmas celebrations. సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన మూడో రోజు కొనసాగుతుంది.
By Medi Samrat Published on 25 Dec 2022 10:55 AM GMTసీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా పులివెందుల బాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సిఎస్ఐ చర్చి ప్రాంగణం చేరుకుని.. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా.. ప్రార్థనలో పాల్గొన్నారు. సీఎస్ఐ టౌన్ చర్చి పాస్టర్ క్రిస్మస్ పండుగ సందేశాన్ని స్వీకరించిన అనంతరం.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు క్రిస్మస్ కేకును కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం.. చర్చి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున ప్రతి ఏడాది తన సొంత గడ్డపై ఇదే చర్చిలో కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ద్యేయంగా.. ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. దేవుడి కృప ఎల్లవేళలా వుంటాయని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ పండుగ ఆనందలను, సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. చర్చిలో ముఖ్యమంత్రితో పాటు క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, భారతమ్మ, సత్యవతమ్మ, మాధవీలత తదితర బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.
పండుగ కార్యక్రమాలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జెడ్పి ఛైర్మెన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ తుషార్ డూడీ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు.