ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రోజున సీఎం జగన్ 'జగనన్నకు చెబుదాం' టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. పథకాలకు సంబంధించి గాని, ప్రభుత్వ సేవల్లో ఎదురయ్యే సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకురావొచ్చు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 నెంబర్ ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. టోల్ ఫ్రీ నెంబర్ 1902కు కాల్ చేస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. సమస్యల పరిష్కారానికై ఇది మంచి వేదిక అవుతుందని, ప్రభుత్వ సేవలని పొందడంలో అడ్డంకులను పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలకు సేవ అందించడానికి తాను ఈ స్థానంలో వున్నానని, ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే ఆ ఫిర్యాదు స్టేటస్ పై సీఎం కార్యాలయం ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తుందని అన్నారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో బాగస్వాములవుతారని సీఎం జగన్ అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని.. ఆ తర్వాత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని, ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.