గత ప్రభుత్వంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని.. గత ప్రభుత్వ పాలన దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా సాగిందని జగన్ అన్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా, ఏ అవకతవకలూ లేకుండా పథకాలు అందుతున్నాయని.. లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని అన్నారు. కడప జిల్లా కమలాపురంలో రూ.904 కోట్ల పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కన్నుమూసిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయని.. అనంతరం వాటిని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు తమ ప్రభుత్వం ఆయా పనులు చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడాలను గుర్తించాలని చెప్పారు. జనవరి నెలాఖరులోగా కడప స్టీల్ ప్లాంట్ పనులకు అడుగులు పడతాయని అన్నారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.8800 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుపుతామని చెప్పారు.
చిత్రావతి, గండికోటలలో నీటి నిల్వల సాధ్యం మీ బిడ్డ వైఎస్ జగన్ సీఎం కావడం వల్లేనని జగన్ చెప్పుకొచ్చారు. అందుకోసం రూ.6,914 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ పూరైతే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అలాగే కృష్ణపట్నం పోర్ట్ నుంచి రైల్వే లైన్ కోసం రూ.68 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు.