ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం వేదికగా రాజకీయం రంజుగా సాగుతోంది. 2024లో కుప్పంను కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రణాళికలు రచించి ఆదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన కుప్పంకు రానున్నారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హెలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోకి ముఖ్యమంత్రి వస్తుండడంతో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నసంగతి తెలిసిందే. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.