మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌

CM Jagan has shown his humanity. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో

By Medi Samrat  Published on  21 Dec 2022 8:21 PM IST
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌

బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి, వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌ సీఎంని కలిసి తమ ఇబ్బందులు వివరించారు. వెంటనే స్పందించిన సీఎం, ప్రభుత్వం తరపున సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంట‌నే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపట్ల జిల్లా కలెక్టర్‌ కే. విజయకృష్ణన్‌ వెంటనే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ముగ్గురు దివ్యాంగులకు చెక్కులు అందజేశారు.

మోదుకూరు గ్రామానికి చెందిన గుండ్రెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు, కుమార్తె పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని, ఆరు ఎకరాల భూమిని సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే ఐదు ఎకరాలకు మించి భూమి ఉంటే ఫించన్‌ రాదనే నిబంధన ఉండడంతో వారికి ఆ విషయం తెలిపిన సీఎం, ఆ కుటుంబానికి తక్షణమే ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వలివేరు గ్రామానికి చెందిన కూచిపూడి విద్యాసాగర్‌ భవనం నిర్మిస్తూ ప్రమాదవశాత్తూ మూడంతస్తుల నుండి కిందపడి దివ్యాంగుడై, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నట్లు సీఎంకి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి విద్యాసాగర్‌ కుటుంబానికి కూడా తక్షణమే ఆర్ధిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంటనే ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ముగ్గురు దివ్యాంగులకు చెక్కులు అందజేశారు. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.


Next Story