అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవం సభలో సీఎం జగన్ విపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు తోడేళ్లలా ఏకమై వస్తున్నారని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారని, విపక్ష నేతల మాటలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదల ప్రభుత్వం కావాలో.. పెత్తందారుల ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు. వచ్చేది కురుక్షేత్ర సంగ్రామమని, ప్రజలే తమ సైనికులని అన్నారు.
రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయమే తప్ప వ్యాపారం కాదని అన్నారు. ప్రజలను మోసం చేయకూడదని పాలకుడికి ఒక నిబద్ధత ఉండాలన్నారు. అలాంటి నైతికత ఉన్న మనిషిని ఓ వైఎస్సార్, ఒక జగనన్న అని అంటారని.. అలాంటి నైతికత లేకపోతే చంద్రబాబు అని అంటారని సెటైర్లు సంధించారు. పాడి, పంట ఉండే నాయకత్వం కావాలా? నక్కలు, తోడేళ్లు ఉండే నాయకత్వం కావాలా? ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. రైతు రాజ్యం కావాలా? రైతును మోసం చేసే పాలన కావాలా? అని ప్రశ్నించారు.