ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు ఉన్న అసూయకు మందు లేదని.. అసూయ, కడుపు మంట ఎక్కువైతే గుండె పోటు వచ్చి ఎప్పుడో పోతారని అన్నారు. అసూయ, కడుపు మంట తగ్గించుకోకపోతే ఆరోగ్యాలకు మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ మంచి పనులు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియాకు కనిపించదని ఫైర్ అయ్యారు.
రోజుకొక కట్టు కథలు, వక్రీకరణ, ప్రభుత్వంపై బురదజల్లడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసిన చరిత్ర టీడీపీదని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలి కానీ.. చంద్రబాబు, దత్త పుత్రుడు, ఎల్లో మీడియా రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్నారని అన్నారు. దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో నేను ఈ స్థానానికి వచ్చానని అన్నారు. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు ఉన్నంత వరకు వెంట్రుక కూడా పీకలేరని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా.. జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసామని తెలిపారు.