ఆయ‌న‌ సైకిల్ తొక్కలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నారు

CM Jagan Fire On Chandrababu. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని

By Medi Samrat  Published on  9 July 2022 12:46 PM GMT
ఆయ‌న‌ సైకిల్ తొక్కలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నారు

నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్లీనరీ ముగింపు కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. 2014లో 23 మంది ఎమ్మెల్యేలను కొన్న ఆ పార్టీకి 23 మందే మిగిలారని.. వైసీపీ ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై 151కి చేరిందని అన్నారు. ఒక్క ఎంపీతో మొదలైన ప్రయాణం.. 22కు చేరిందని వివ‌రించారు. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారని.. ఆనాడు మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని విమ‌ర్శించారు. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడంపైనేన‌ని.. మ‌నిషికి రెండు గుణాలు ముఖ్యం అవి క్యారక్టర్‌, క్రెడిబిలిటీ అని.. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదని విమ‌ర్శించారు.

మేనిఫెస్టో లో ఏం చెప్పామో అదే చేస్తున్నామ‌ని.. చంద్రబాబు దృష్టిలో రాజకీయమంటే వ్యాపారం. ప్రజల నుంచి ఎలా దోచుకోవాలి.. దోచుకున్నది ఎలా దాచుకోవాలో అని ఆలోచించ‌డం అని విమ‌ర్శించారు. మనకు తెలిసిన రాజకీయం ప్రజల మీద మమకారమ‌ని తేడాను వివ‌రించారు. టీడీపీ అంటేనే పెత్తందారు పార్టీ అని.. గజ దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. టీడీపీ అంటే.. పెత్తందారుల వల్ల, పెత్తందారుల చేత, పెత్తందారుల కొరకు నడిచే పార్టీ అని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు పార్టీ సిద్దాంతమే వెన్నుపోట్లు అని విమ‌ర్శించారు.

కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయమని 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడని వివ‌రించారు. చంద్రబాబు పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదవాలంట.. పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా అని ప్ర‌శ్నించారు. ఈ మూడేళ్లలో విద్య కోసం రూ.52వేల కోట్లు ఖర్చు చేశామ‌ని తెలిపారు.

నాడు - నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామ‌ని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్య శ్రీని నీరుగార్చారని విమ‌ర్శించారు. 108, 104లను సైతం చంద్రబాబు పట్టించుకోలేదని.. ఆరోగ్య శ్రీ పరిధిని 1000 నుంచి 2,446 వ్యాధులకు పెంచామ‌ని అన్నారు. అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకూ రూ.19,617 కోట్లు ఇచ్చామ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.16,132 కోట్లు ఖర్చు చేశామ‌ని.. నాడు - నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మారుస్తున్నామ‌ని వివ‌రించారు.

గజ దొంగల ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాల‌ని జ‌గ‌న్ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అడుగులు ముందుకే వేశామ‌న్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు అని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నాడని.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టినందుకు ఎస్సీ మంత్రి ఇంటిని, బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టించారని ఫైర్ అయ్యారు.

దేవుడి దయతో మంచే గెలుస్తుందని.. 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామ‌ని అన్నారు. గట్టిగా మొరిగినంత మాత్రానా గ్రామ సింహాలు సింహాలు అయిపోవు.. చంద్రబాబు సైకిల్ తొక్కలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నార‌ని సెటైర్లు వేశారు. ఎల్లో మీడియాలో చెప్పినంత మాత్రానా అబద్దాలు నిజం కావు.. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేన‌ని.. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నదే దుష్టచతుష్టయం కుట్ర అని అన్నారు. నాకున్న గుండె ధైర్యం మీరే.. కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునిడి పాత్ర మీదేన‌ని వ్యాఖ్యానించారు.

175కి 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకు వేద్దాం.. ఇది అసాధ్యం కాదు ఇది సుసాధ్యం అని ప్లీన‌రీకి హాజ‌రైన శ్రేణుల‌కు దిశానిర్ధేశం చేశారు. మనం చేసిన మంచిని కుప్పం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించారని.. కుప్పం మునిసిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌స్వీప్ చేశామ‌ని వివ‌రించారు. బూతు కమిటీల్లో కూడా సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వండని ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తుకు.. మీ భవిష్యత్తుకు నాది బాధ్యత అని.. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టండని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు మనం సన్నద్దం కావాలి.. పార్టీ మీకు ఎప్పుడూ తోడుగా, అండగా ఉంటుందని అన్నారు. మనం చేసిన ప్రతి మంచి పని గడప గడపకు తీసుకెళ్లండని శ్రేణుల‌ను కోరారు. ప్రతి కార్యకర్త నావాడే.. మీరు ఇచ్చిన ధీమాతోనే ముందుకు నడుస్తున్నాన‌ని జ‌గ‌న్ అన్నారు. ప్లీన‌రీకి సుమారు 7 నుంచి 8 లక్షల మంది అభిమానులు వచ్చి ఉంటారని అన్నారు. వచ్చే ఎన్నికలు మనకు ఎంతో కీలకమ‌ని.. 175 సీట్లకు 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేయాలని శ్రేణుల‌ను ఆదేశించారు.




























Next Story