చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు : సీఎం జగన్

ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని.. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  8 April 2024 2:45 PM GMT
చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు : సీఎం జగన్

ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని.. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అలాంటి రాజకీయాలను మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నానని సీఎం జగన్ అన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి.. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్‌ వచ్చేది.. అప్పట్లో పెన్షన్‌ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేదని.. తమ హయాంలో 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. అవ్వాతాతలు పెన్షన్‌ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి నేను ఆలోచన చేశానన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వతాతల ఇంటికే పెన్షన్‌ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయమే పెన్షన్‌ అందించామని అన్నారు.

చంద్రబాబు, వారి కూటమిలా నొటికొచ్చిన అబద్ధాలు చెప్పలేనన్నారు సీఎం జగన్. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడు.. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రూ.3వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే ఇస్తున్నామని.. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడని.. జాగ్రత్తగా ఉండాలన్నారు.

Next Story