వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
CM Jagan Aerial survey in flood affected areas.గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2021 3:45 PM ISTగత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. చాలా చోట్ల జన జీవనం స్తంభించింది. వర్షాల కారణంగా సంభవించిన వరదలతో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా.. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చిత్తూరు, నెల్లూరు, కడప ఇతర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. కడప, రేణిగుంట విమానాశ్రయాల్లో అధికారులతో సీఎం సమీక్షించారు. వరద పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రధాని మోదీతో సీఎం జగన్ శుక్రవారం ఫోన్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే.
పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2వేల చొప్పున అందజేయాలని అధికారులను ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ నగదు ఉపయోగపడుతుందన్నారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. మంచి భోజనం, తాగునీరు అందించాలని సూచించారు. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలన్నారు.