శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షుడు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం ఆదేశించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే.. పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.
రామశేషు హత్య శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. రామశేషు శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ వద్దకు వెళుతున్న క్రమంలో దుండగులు ఆయన్ను హతమార్చారు. ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి ఆయన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలతో ఘటనాస్థలంలోనే ఆయన మృతి చెందారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామశేషు హార్డ్‌వేర్, సిమెంట్, ఎరువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గ్రామంలో మూడు సార్లు సర్పంచ్‌గా కూడా పని చేశారు. ఆరేళ్ల క్రితం కూడా రామశేషుపై దాడి చేశారు. ఆ సమయంలో తీవ్రగాయాలు అయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. మరోమారు జరిగిన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.