మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియ‌స్‌

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 23 Sept 2025 8:50 PM IST

మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా..? : తప్పుడు ప్రచారంపై చంద్రబాబు సీరియ‌స్‌

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో మంగళవారం వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోని వాస్తవాలను సభ ముందు ఉంచారు. వైసీపీ అసత్య ప్రచారాలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎండగట్టారు. కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”చరిత్ర తెలియని వారు రాజకీయం కోసం మెడికల్ కాలేజీల నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైద్యారోగ్య రంగంలో మౌళిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే పీపీపీ విధానం అవసరం. 1996లో నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే విధానాన్ని అప్పట్లోనే మేం అమలు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 38 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 18, ప్రైవేట్ రంగంలో 18, ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, గీతమ్స్ యూనివర్శిటీలో మరో మెడికల్ కాలేజీ ఉంది. ఫేక్ న్యూస్ ఫేక్ ప్రచారంతో మెడికల్ కాలేజీలపై ప్రజలను కొందరు మభ్యపెడుతున్నారు.” అని సీఎం అన్నారు.

మెడికల్ కాలేజీలపై వాస్తవాలిగో..

“విభజన జరిగాక.. ఏపీకి మా హయాంలో 1,819 మెడికల్ సీట్లను తెచ్చాం. 2014-19 మధ్య కాలంలో 1,212 సీట్లు వస్తే, 2024-25లో మరో 607 సీట్లు తీసుకొచ్చాం. గత పాలకులు 2019-2024 మధ్యన కేవలం 452 సీట్లు మాత్రమే తేగలిగారు. గత ప్రభుత్వం రూ.8480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని చెప్పింది. ఐదేళ్లల్లో వాళ్లు పెట్టిన ఖర్చు కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే. ఇది మొత్తం ఖర్చులో 18 శాతం. కూటమి అధికారంలోకి వచ్చాక.. 15 నెలల కాలంలోనే రూ.787 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది మొత్తం ఖర్చులో 9 శాతం. 5 ఏళ్లలో 18 శాతం మాత్రమే ఖర్చు చేసిన వాళ్లు... ఏడాదిలోనే 9 శాతం ఖర్చు పెట్టిన మాపై నిందలేస్తున్నారు. గత పాలకుల తరహాలో కాలేజీల నిర్మాణం చేపడితే.. మరో 15 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు కాలేజీలు ప్రారంభించవద్దా..? పేదలకు సేవలు అందించవద్దా..? పార్వతీపురం కాలేజీకి అసలు టెండర్లే పిలవలేదు.. కానీ నిర్మించేశామని ప్రచారం చేసుకుంటున్నారు.” అని చంద్రబాబు ఆక్షేపించారు.

కన్వీనర్ కోటా పెంచాం

“గత ప్రభుత్వ విధానం ప్రకారం కన్వీనర్ కోటాలో ప్రతి కాలేజ్ లో 64 సీట్లు మాత్రమే ఉంటే... కూటమి ప్రభుత్వం 75 సీట్లు ఇస్తోంది. అంటే గత ప్రభుత్వానికంటే.. ప్రతి కాలేజీలో 11 సీట్లు ఎక్కువగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నాం. మొత్తంగా పీపీపీ విధానంలో నిర్మించే 10 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో అదనంగా 110 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మా విధానం వల్ల కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికున్న అభిమానం, చిత్తశుద్ధి. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. దుష్ప్రచారం చేపడుతున్నారు. మేం ఆ స్థాయికి దిగజారలేం. విమర్శలు చేసేవాళ్లు పీపీపీ అంటే ఏంటో తెలుసుకోవాలి. 33 ఏళ్ల తర్వాత కాలపరిమితి ముగియగానే ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. జేగూరుపాడు విద్యుత్ ప్రాజెక్టు కాలపరిమితి ముగిశాక ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చేసింది. యూపీ, ఒడిషా, ఝార్ఖండ్ రాష్ట్రాలు పీపీపీ పద్దతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నాయి. ఇవే కాకుండా ఐఐటీ చెన్నై, ఉదయ్ పూర్, నాగపూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పీపీపీలోనే కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. అంత మాత్రాన అవి ప్రైవేటీకరణ కాదు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పీపీపీ విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

పేదలకు ఉచితంగానే వైద్య సేవలు

“మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ విధానంలో చేపట్టినా... వైద్య సేవలు ఉచితంగానే ఉంటాయి. ఔట్ పేషంట్ విభాగం సేవలు, మందులు, ఇతర ఆరోగ్య సేవలు అన్నీ ఉచితమే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు, పీఎం ఆయుష్మాన్ భారత్ వైద్య సేవలు ఉచితంగానే అందుతాయి. పీపీపీ విధానం వల్ల మౌళిక సదుపాయాలు పెరుగుతాయి... నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి... సామర్థ్యం పెరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఇలాంటి వాస్తవాలను దాచిపెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ప్రజారోగ్యం విషయంలో... వైద్యపరమైన మౌళిక సదుపాయాల కల్పనలో ఓ ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం వెళ్తోంది. మెడికల్ కాలేజీల విషయంలో కొందరు దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నారు. ట్రైబల్ యూనివర్శిటీని సాలూరుకు మార్చినప్పుడు మేమేమీ అభ్యంతరం పెట్టలేదు. అక్కడే ఆ యూనివర్శిటీ నిర్మాణం పూర్తి చేస్తాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Next Story