అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఆగస్ట్ 2న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ.6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా ప్రభుత్వం మరో రూ.14,000 ఇవ్వనుంది.
ఈ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.20,000 నగదును ప్రభుత్వం 3 విడతలుగా ఇవ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000... కేంద్రం వాటా రూ.2,000 చొప్పున ఆగస్ట్ 2న విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది చేకూరనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పీఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్రం రూ.831.51 కోట్లు రైతుల ఖాతాలో జమచేయనుంది. ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.