ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు నాయడు అన్నారు.

By Medi Samrat
Published on : 4 July 2025 6:50 PM IST

ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి, శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సిఎం చంద్రబాబు నాయడు అన్నారు. రెవెన్యూ శాఖ లో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని...గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన చేకూర్చాలని సిఎం అన్నారు. ఈ విషయంలో గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్ర స్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సిఎం సూచించారు. శుక్రవారం సచివాయంలో రెవెన్యూ శాఖపై సిఎం చంద్రబాబు నాయుడు రెండు గంటల పాటు సమీక్ష చేశారు. భూ సమస్యలు, ప్రజల అర్జీలు, రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ”అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలి. ప్రభుత్వం వచ్చిన తరువాత 43.89 లక్షల మందికి కుల ధ్రువీకరణ ప్రతాల అందేజేశారు. మిగిలిన వారికి కూడా వీటిని అందించాలి. ఒకసారి ధృవీకరణ పత్రం పొందితే, వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్ గా ఆ డాటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలి. ఎస్సీలకు స్మశాన వాటికల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలి. 363 హేబిటేషన్స్ కు స్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలి. దీనికి భూసేకరణ కోసం రూ. 137 కోట్లు అవసరం. వచ్చే రెండు మూడేళ్లలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అన్నారు.

జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు

"జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఉండడంతో.. ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోండి. రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదు. రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. అలాగే మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. అంటే వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇళ్ల స్థలాలకు ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 99,390 మంది అప్లై చేశారు. దీని కోసం 2,051 ఎకరాలు అవసరం. మ్యానిఫెస్టో చెప్పినట్లు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో మూడు సెంట్ల కోసం భూ సేకరణ సేకరణ చేసి ఇద్దాం. అర్బన్ లో టిడ్కో ఇళ్లు ఇస్తాం....రూరల్ లో మూడు సెంట్ల తో స్థలాలు ఇద్దాం. దీనిపై క్యాబినెట్ రెవెన్యూ, హౌసింగ్, మునిసిపల్ మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేద్దాం” అని సిఎం అన్నారు.

రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీపై అధికారులు మాట్లాడుతూ.. “ కూటమి ప్రభుత్వ వచ్చిన తరువాత నిర్వహించిన 17600 రెవెన్యూ సదస్సుల్లో 1.85 లక్షల దరఖాస్తులు ప్రజల నుంచి వస్తే వీటిలో 1,85,049 పరిష్కారం అయ్యాయి. ఇంకా 668 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఏడాదిలో రెవెన్యూ శాఖలకు సంబంధించి 4,50,603 గ్రీవియన్స్ వచ్చాయి. వీటిలో 3,99,645 పరిష్కారం చూపాం. ఆటో మ్యూటేషన్స్ లో 1.93 లక్షలు ధరఖాస్తులు వస్తే...వాటిలో 1.77 లక్షలు పరిష్కరించాం. ప్రజల అర్జీల పరిష్కారం విషయంలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం. అధికారుల స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఉన్న సందర్భాల్లో ప్రజలకు వాటిపై వాస్తవాలు వివరిస్తున్నాం. గత ప్రభుత్వ అక్రమాలకు వేదికగా చేసుకున్న భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై జీవోఎం 10 రకాల సూచనలు చేసింది. దీనిపై ఈ నెల 9వ తేదీన మరో మారు మంత్రుల సబ్ కమిటీ సమావేశం ఉంది అని అధికారులు వివరించారు. జీవోఎం ఇచ్చిన 10 సూచనల్లో 8 సూచనలకు సిఎం కూడా అంగీకారం తెలిపారు. దీనిపై మంత్రుల కమిటీలో మరింత చర్చించి ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అక్టోబర్ నాటికి ఫ్రీ హోల్డ్ అంశానికి పూర్తి పరిష్కారం చూపాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులకు స్పష్టం చేశారు.

సర్వే రాళ్లపై బొమ్మల తొలగింపు పూర్తి

ముఖ్యమంత్రి మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో జగన్ సర్వే రాళ్లపై తన బొమ్మలు ముద్రించుకున్నాడు. వీటికి సంబంధించి 77.9 లక్షల సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మల తొలగింపు పూర్తి చేశారు. అలాగే సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నాటికి అందచేయండి. ముద్రణ పూర్తి చేసి 21.86 లక్షల మందికి తొలివిడతగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వండి. ప్రతి పట్టా దారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ తో పాటు....ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తి గతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలి. ఆధార్ కార్డు తో సమగ్ర భూ వివరాలు రావాలి. తమ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి. అదే విధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు, పాలసీలకు అనుసరించి....అన్ని ఉత్తర్వులతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్టు నాటికి తేవాలి. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ధరఖాస్తుల పరిష్కారంపై ప్రైవేటు టీంతో ఆడిటింగ్ చేయాలి. అప్పుడు సమస్యల పరిష్కారం పై ఒక అంచనా వస్తుంది. అలాగే ప్రజలు అనధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. డిసెంబర్ లోపు ఈ తరహా అన్ని ధరఖాస్తులు పరిశీలించి రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలి. వాట్సాప్ గవర్నెన్స్ లో 56 సర్వీసులు ఉన్నాయి. వాడుకలో లేని సర్వీసులను తొలగించాలి. మన మిత్రలో 9 లక్షల మంది సర్వీసులు కోసం రిక్వెస్టులు పెట్టారు. అయితే సర్వీసులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. వారసత్వంగా వచ్చే భూములును పంచుకునే విషయంలో రూ.100 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చు. ఆ భూమి విలువ రూ. 10 లక్షల విలువైన ల్యాండ్ అయితే రూ. 100...ఆ పైన విలువైన ల్యాండ్ అయితే రూ. 1000 చెల్లించి సక్సెషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గ్రామ వార్డు సిబ్బందికి అవసరమైన అధికారాలు ఇవ్వాలి. అలాగే రీసర్వే 2.0కు ఆర్థిక సమస్య రాకుండా చూడండి. కేంద్రం ఇచ్చే నిధులను రీ సర్వేకే ఇవ్వండి. డిసెంబర్ 2027 రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీ సర్వే 100 శాతం పూర్తి చేయాలి. రీ సర్వే పూర్తి అయ్యేవరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యథావిధిగా కొనసాగించాలి. ప్రతి మూడు నెలలకు దీనిపై సమీక్ష చేస్తాము. అదే విధంగా నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి క్యాబినెట్ ముందుకు తీసుకురావాలి” అని సిఎం చెప్పారు.

రెవెన్యూ వాళ్లకు ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయింపు

రెవెన్యూ అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని..దీని కారణంగా కూడా సేవల విషయంలో పూర్తి స్థాయి ఫలితాలు రావడం లేదని అధికారులు తెలిపారు. జిల్లాలకు, తమ ప్రాంతానికి ఏ మంత్రి వచ్చినా, మరే అధికారి వచ్చినా ప్రోటోకాల్ విధులు తాసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు చూస్తున్నారని.. దీని కారణంగా వారి అసలు పని మరుగున పడుతుందని సిఎం దృష్టికి తెచ్చారు. దీనిపై సిఎం మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పారు. జిల్లాల్లో కూడా జిఎడి తరుపున ప్రోటోకాల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని అన్నారు. దీని కోసం జిల్లా స్థాయిలో అవసరమైన విధంగా ప్రోటోకాల్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు వాళ్ల శాఖ అధికారులు వెళితే సరిపోతుందని సిఎం అన్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్ పోస్టు అనేది పనిష్మెంట్ పోస్టు కాదని....వాళ్లకు అవసరమైన సదుపాయాలు కల్పించి వారితో పనిచేయించుకోవాలని సిఎం చెప్పారు.

భూ వివరాలు కనిపించేలా పోర్టల్

రెవెన్యూ శాఖ తీసుకువస్తున్న కొత్త పోర్టల్ గురించి రివ్యూ లో అధికారులు సిఎంకు వివరించారు. రాష్ట్ర పరిధిలో ఏరకమైన ల్యాండ్ ను అయినా ఆ పోర్టల్ ద్వారా ఫిజికల్ గా చూడవచ్చు. పోర్టల్ లో సదరు ల్యాండ్ ను మార్క్ చేయగానే ఆ ల్యాండ్ యజమాని నుంచి సమస్త వివరాలు అక్కడ కనిపిస్తాయి. హద్దులతో సహా ఆ ల్యాండ్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న అడవులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి ప్రాంతాలు, చెరువులు, ఆక్రమణల్లో ఉన్న స్థలాలు, వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఎవరైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా పక్కాగా ఆ ల్యాండ్ ఎవరి పేరుతో ఉందో చూడా చూడవచ్చు అని అధికారులు సూచించారు. ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఈ పోర్టల్ ను సమగ్రంగా తీసుకురావాలని సిఎం సూచించారు. దీనికి ఆలోచించి మంచి పేరు పెట్టాలని అధికారులకు సిఎం సూచించారు. గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత గాడిన పడిందన్న సిఎం....ప్రజల సమస్యల పరిష్కారంలో, పూర్తి స్థాయి సంతృప్తి సాధించడంలో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలని సూచించారు. సమీక్షలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సిసిఎల్ జి.జయలక్ష్మి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story