నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని.. 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 3 July 2024 2:21 PM ISTరాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని.. 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని.. ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయారియా కేసులు నమోదయ్యాయని. ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్ లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని.. వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని.. వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అన్ని చోట్లా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని.. కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని.. నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీసెస్ పునరుద్ధరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. డెంగ్యూ వస్తే వైద్యానికి లక్షల్లో ఖర్చు అవ్వడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. వారి జీవితాలు తల్లకిందులు అవుతున్నాయని సిఎం అన్నారు.