అమరావతిపై శ్వేతపత్రం విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By అంజి Published on 3 July 2024 4:05 PM ISTఅమరావతిపై శ్వేతపత్రం విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకైనా సమాన దూరంలో ఉండేలా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. తమ అధ్యయనంలో అత్యధిక శాతం మంది విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలని చెప్పారని, ఆ విధంగానే ముందుకెళ్లామని వివరించారు. రాజధాని కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ బ్యాంకు దీన్ని కేస్ స్టడీగా తీసుకుందని వివరించారు.
వేల మంది రైతులు స్వచ్ఛంధంగా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. అమరావతిని మాజీ సీఎం జగన్ కూడా ఆమోదించారని పేర్కొన్నారు. లండన్ మ్యూజియంలో అమరావతికి ఒక గ్యాలరీ పెట్టారని తెలిపారు. అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరమని, అమరావతి పేరును కేబినెట్‌లో వందశాతం అంగీకరించారని సీఎం తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామని, దేశంలోని ప్రముఖ దేవాలయాల నుంచి మట్టి, జలం తీసుకొచ్చామని, ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉందన్నారు. యమునా నది నీరు, పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.
''29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలే చూశారు'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ప్రజా వేదికను కూల్చారని తెలిపారు. మూడు రాజధానుల కోసం జగన్ ఎన్ని విన్యాసాలు చయాలో.. అన్ని విన్యాసాలు చేశారని మండిపడ్డారు. ప్రజా వేదిక శిథిలాలను అలాగే ఉంచాలని నిర్ణయించామని, భవిష్యత్ తరాలు ఈ విధ్వంసాన్ని చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు అప్పట్లో యూఎస్‌లోని ప్రతి కంపెనీకి తిరిగానని సీఎం చంద్రబాబు చెప్పారు. సైబర్ టవర్‌ను నిర్మించాక సంస్థల్ని రప్పించేందుకు 14 రోజులు యూఎస్‌లో తిరిగానన్నారు. సైబరాబాద్‌ను అభివృద్ధి చేస్తుంటే వాస్తుకు విరుద్ధంగా అటు వైపు వెళ్తున్నారేంటని చాలా మంది అన్నారని, భూమి అటువైపే ఉందని చెప్పానని చంద్రబాబు తెలిపారు. పైపులైను ద్వారా కృష్ణా జలాలు తెచ్చానని, మైక్రోసాఫ్ట్ సీఈవో కూడా హైదరాబాద్‌లో పని చేశారని చంద్రబాబు తెలిపారు.