ఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ,.. సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు వీటిపైనే
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో గుర్తుండిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు.
By అంజి Published on 13 Jun 2024 6:26 AM ISTఫించన్ల పెంపు, మెగా డీఎస్సీ,.. సీఎం చంద్రబాబు మొదటి 5 సంతకాలు వీటిపైనే
ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు.. అంతే స్థాయిలో గుర్తుండిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. నిరుద్యోగ యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై మొదటి సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో నేటి సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఈ ఫైళ్లపై సంతకాలు చేస్తారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు రిపోర్ట్ తయారు చేశారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో దీనిపైచర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను పొందుపరిచారని ప్రజల నుంచి అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు చట్టం రద్దు చేయబోతున్నారు.
ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఫించన్లను రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు. అర్హులకు జులై 1న రూ.7 వేల పింఛను (జులై 1న ఇచ్చే రూ.4 వేలు+ ఏప్రిల్ నెల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున) అందించనున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు చంద్రబాబు ప్రారంభించారు. పూటకు రూ.5 చొప్పున మూడు పూటలకూ కలిపి రూ.15కే ఆహారాన్ని అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం చేసేవారు. అయితే ఈ క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం నిలివేసింది. ఈ క్రమంలోనే అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
యువత ఉన్నత విద్యను అభ్యసించినా.. దానికి తగ్గట్టు ఉద్యోగాలు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్యకు పరిష్కారంగానే ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు చంద్రబాబు. ఈ ఫైల్‌పై చంద్రబాబు ఐదో సంతకం చేయనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు.