రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.
88 శాతం పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం
గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.