హైదరాబాద్: తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకున్నారు. జ్వరం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎం తో చర్చించారు. ఆటో డ్రైవర్ల కోసం చేపట్టే ఈ పథకం కూడా మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉన్నట్లు పవన్ తెలిపారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహణపైనా చర్చించారు. వచ్చే నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా రోడ్ షో నిర్వహణ విజయంతం చేసే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వీటితో పాటు డీఎస్సీ అంశం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.