దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో కానుక
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది.
By - Medi Samrat |
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి బుధవారం అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నాను. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు.
‘స్త్రీశక్తి’ బస్సులే ‘దివ్యాంగ శక్తి’కి వర్తింపు
ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100 శాతం మూగ, చెవిటి వారికి, అలాగే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది. అయితే ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40 శాతం, లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు అందరికీ స్త్రీశక్తి పథకం కింద వర్తించే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా రాష్ట్రమంతా ప్రయాణం చేసే వెసులుబాటు లభించింది. అంతేకాదు, వారితో పాటు వచ్చే సహాయకులకు ఈ బస్సుల్లో 50 శాతం రాయితీ లభిస్తుంది.
4 నుంచి 21 వర్గాలకు పథకం విస్తరణ
ఇప్పటివరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతుండగా... పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా... ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరిగనుంది.
7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈరోజు నుంచి స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింప చేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాస్‌లు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలో దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్‌ను సదరం యాప్‌తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్‌తో ఉచిత డిజిటల్ పాస్‌లు జారీ చేస్తారు.
ఏడాదికి రూ.207 కోట్ల వ్యయం
ఈ పథక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.207 కోట్లు సబ్సిడీ అందిస్తుంది. దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. స్త్రీ శక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్ధిక వెసులు బాటు, సాధికారత కల్పించింది. గతేడాది ఆగస్ట్ 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే... ఈ మార్చి 15 నాటికి... అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా చేశారు. దీనికి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,826 కోట్లు రాయితీ భరించింది. మహిళల ఉచిత ప్రయాణాలకు రోజుకు ప్రభుత్వం రూ.8.57 కోట్లు ఖర్చు పెడుతోంది. సగటున 24.38 లక్షల మంది స్త్రీ శక్తిని రోజూ వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రతీ వందమందిలో 37 మంది మగవాళ్లు ఉంటే, 63 మంది మహిళలే ఉంటున్నారు. ఇది స్త్రీ శక్తి పథకం ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో చెబుతోంది. దివ్యాంగ శక్తి కూడా ఇంతే ఆదరణ పొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దివ్యాంగులకు సమాజంలో సరైన స్థానం, గుర్తింపు, గౌరవం కల్పిస్తామన్న మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రవేశ పెట్టడం ద్వారా మరోసారి నిలబెట్టుకున్నారు.