అలా చేస్తేనే ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది, టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
By - Knakam Karthik |
అలా చేస్తేనే ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది, టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
అమరావతి: జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేసే సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే... ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటి పెరుగుతుంది. ప్రజలతో మమేకం కావడమే కాదు... ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజా ప్రతినిధులు, నేతలు కేడరే పార్టీకి ప్రతినిధులు. పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహర శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోంది. పీక్ లోడ్ లో కరెంట్ కొనుగోలు చేయకుండా.. స్వాపింగ్ విధానాన్ని అనుసరించాం. దీంతో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాం. సమర్థ పాలనకు.. అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలి...అని సీఎం సూచించారు.
జనాభాలో 13 శాతం మందికి పెన్షన్ల ద్వారా ఆర్దిక సాయం చేస్తున్నాం. అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్ల నిమిత్తం కేవలం రూ.5500 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా నిధుల్ని పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తోంది. ఆటోడ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు వివరించాలి. సూపర్ సిక్స్-సూపర్ హిట్ దీన్ని ప్రజలకు చెప్పాలి... ఓనర్ షిప్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే... ప్రజలు మనవైపే నిలుస్తారు. ప్రజలు మనవైపు ఉంటే... రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమిగా ఉన్నాం.. అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. అంతకు మించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలి...సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.