కార్యకర్తలను దూరం పెడితే..నేనూ మిమ్మల్ని దూరం పెడతా"..నేతలకు చంద్రబాబు వార్నింగ్!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కీలక ప్రసంగం చేశారు.
By - Knakam Karthik |
కార్యకర్తలను దూరం పెడితే..నేనూ మిమ్మల్ని దూరం పెడతా"..నేతలకు చంద్రబాబు వార్నింగ్!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కీలక ప్రసంగం చేశారు. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదానికి నిదర్శనంగా ఈసారి వేదికపై సామాన్య కార్యకర్తలను కూర్చోబెట్టి, తాను మంత్రులు, సీనియర్ నేతలతో కలిసి కింద సభికుల్లో కూర్చోవడం ద్వారా సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే అసలైన పునాది అని, వారిని గౌరవించని నాయకులను తాను ఉపేక్షించబోనని, కార్యకర్తలకు దూరంగా ఉండే నేతలను తాను కూడా దూరం పెడతానని మంత్రులు, ఎమ్మెల్యేలను కఠిన స్వరంతో హెచ్చరించారు. భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా పెరిగే 50 శాతం సీట్లు మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో, పార్టీ కోసం క్రమశిక్షణతో కష్టపడే వారికే పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యతను నారా లోకేశ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, పార్టీని అంతం చేయాలనుకున్న వారే కాలగర్భంలో కలిసిపోయారని, అక్రమ కేసులు, జైలు శిక్షలు ఎదుర్కొన్నా కార్యకర్తల అండతోనే మళ్ళీ అధికారాన్ని సాధించామని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం పథకం నుంచి నేటి 'సూపర్ సిక్స్' వరకు టీడీపీ ఎప్పుడూ పేదల పక్షపాతి అని కొనియాడారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ. 4,000 పెన్షన్ ఇస్తున్నామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై మాట్లాడుతూ, "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని" అని, 2028 ఆగస్టు నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు. కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా పాలన అందిస్తామని, అందరూ నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ బ్రాండ్‌ను కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సభలో అండమాన్ నికోబార్ దీవుల ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం.