పేరుమార్చుకుని అన్నం పెట్టాలన్నా పట్టించుకోలేదు : చంద్రబాబు
పేదవాడు ఆకలితో ఉండకూదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం, క్యాంటీన్లు శాశ్వతంగా, నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat Published on 15 Aug 2024 5:27 PM ISTపేదవాడు ఆకలితో ఉండకూదన్నదే అన్నక్యాంటీన్ల లక్ష్యం, క్యాంటీన్లు శాశ్వతంగా, నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుడివాడలో సతీమణి భువనేశ్వరితో కలిసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 4వ సారి సీఎం అయ్యా.. ఎన్నో కార్యక్రమాలు చేపట్టా. అన్నక్యాంటీన్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవరం రోజున క్యాంటీన్లు ప్రారంభించి నిజమైన దేవుళ్లైన మీ దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. అన్నక్యాంటీన్ ప్రారంభించినప్పుడు భోజనం చేయడానికి వచ్చిన వారి అభిప్రాయాలు విన్నాక సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఈ గుడివాడలో అన్నక్యాంటీన్ ప్రారంభించా. ఎన్టీఆర్ పుట్టిన ఈ ప్రాంతంలో ఎవరూ ఆకలితో ఉండ కూడదని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గుడివాడకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోజనం చేయడానికి వచ్చిన వారికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించారు. ఒక్కొక్కిరిని పలకరించి వారి కుటుంబ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘ప్రతి ఒక్కరం జానెడు పొట్టకోసమే బతుకుతాం. డొక్కా సీతమ్మ ఆ రోజుల్లోనే ఆకలితో తన వద్దకు వచ్చేవారికి ఏ సమయంలోనైనా అన్నం పెట్టేవారు. అందుకే డొక్కా సీతమ్మ శాశ్వతంగా గుర్తున్నారు. ఎన్టీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక తిరుపతి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన వారు విరాళాలు కూడా ఇస్తున్నారు. టీటీడీ నిధులు ఖర్చులేకుండా ట్రస్ట్ వచ్చిన విరాళాలతో రోజూ భోజనం పెడుతున్నారు. 2018లో నేను అన్నా క్యాంటీన్లు ప్రారంభించా. అన్నం అందరికీ అవసరం. క్యాంటీన్ల పున:ప్రారంభంతో ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, షాపుల్లో పని చేసేవారిలో ఆనందం ఉంది. రోజువారి సంపాదనలో రూ.100 లు భోజనానికే సరిపోతే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని చెప్తున్నారు. అందుకే రూ.15లతో మూడు పూటలా ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం. 203 అన్న క్యాంటీన్లు నాడు ప్రారంభించాం. రోజూ 1.41 లక్షల మంది చొప్పున టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 4.60కోట్ల మందికి ఆహారం అందించాం. ఇందుకుగాను రూ.130 కోట్లు ఖర్చు పెట్టాం. మంచి కార్యక్రమాలను కొనసాగించాల్సిన గత ప్రభుత్వం అన్నక్యాంటీన్ మూసేసింది. నచ్చిన పేరు పెట్టుకుని అన్నదానం కొనసాగించాలని అడిగినా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు భోజనం పెట్టేందుకు ముందుకు వస్తే దుర్మార్గంగా వ్యవహరించి దౌర్జన్యం చేశారు. అన్నంపెట్టేవారిని కూడా పెట్టనీయలేదు. ఆనాడు మంచి బిల్డింగులు, మంచి ప్రదేశాల్లో క్యాంటీన్లు నిర్మించాం. ఆహారం కూడా నాణ్యతతో అందించాం. నేడు 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం...సెప్టెంబర్ నెల చివరి నాటికి 203 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తాం. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంటీన్ నుండి రోజుకు 350 మందికి ఆహారం అందించి... రద్దీని బట్టి పెంచుతాం. ఒక్కో క్యాంటీన్ కు రోజుకు రూ.26,256లు ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్లకు రూ.26 లక్షలు ఖర్చు అవుతుంది. 203 క్యాంటీన్లకు రూ.53.28 లక్షలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. కానీ గత ప్రభుత్వం పేదవాళ్ల పొట్టగొట్టింది. ఎందుకు అన్నక్యాంటీన్లు మూసేశారు? అన్నక్యాంటీన్ పెత్తందారులదా.?’’ అని సీఎం ప్రశ్నించారు.