ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
By Medi Samrat
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆతర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాలు కలుషితమయ్యాయి. నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్తను ఊడ్చేసినట్లుగానే రాజకీయాల్లో ఉన్న మలినాన్ని కూడా క్లీన్ చేయాలి. నేర రాజకీయాలు మనకు అవసరమా? వాటిని అడ్డుకోలేమా? ప్రజలు ఆలోచన చేయాలి. 2019 ఎన్నికలకు ముందు నేను మోసపోయాను. సాక్షి అని పత్రిక పెట్టారు. దాంతో చేసేవన్నీ వెధవ పనులే. పేరు మాత్రం సాక్షి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో వేశారు. సాయంత్రానికి గొడ్డలిపోటు అని డ్రామాలాడారు. చివరకు నారాసుర చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి పత్రికలో రాశారు. ప్రజలు అయ్యో పాపం అనుకున్నారు. మళ్లీ మళ్లీ మోసం చేస్తే మనం మోసపోవాలా’ అని సీఎం ప్రశ్నించారు.
ఇటీవల బంగారుపాళ్యం రైతుల దగ్గరకు వచ్చి హడావుడి చేశాడు. మన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే సదుద్ధేశంతో టన్ను మామిడికి టన్నుకు రూ.12 వేలు ఇచ్చేలా చేసింది. ప్రభుత్వం తరపున రూ.4 వేలు, కొనుగోలుదారులు రూ.8 వేలు చెల్లించే ఏర్పాట్లు చేశాం. రైతుల పరామర్శకు వచ్చి రోడ్లపై మామిడి పండ్లు పోసి పులివెందుల రాజకీయం చేశాడు. హత్యా రాజకీయాలు నా జీవితంలో లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని, ప్రజలకు భద్రతకు కల్పించాలని భావించాను. హింసా రాజకీయాలు నా దగ్గర కుదరవు. గత ఐదేళ్లలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఎన్డీఏ వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని అన్నారు.