మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది : చంద్రబాబు

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

By Medi Samrat  Published on  15 March 2025 3:55 PM IST
మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది : చంద్రబాబు

స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని.. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుభారం ప్రజలపై మోపారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తాన‌ని పేర్క‌న్నారు. మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. మీ ఊరికి వచ్చే విషయం కేవలం రెండు, మూడు గంటల ముందే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది. సమైక్యాంధ్రలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా నేను ప్రారంభించాను.. ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం.. స్వచ్ఛ భారత్ నివేదిక ఇచ్చాను. నా ఆశయం ఒకటే స్వచ్ఛమైన ఏపీ తయారుచేయాలన్నారు.

స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర మా లక్ష్యం. విశాఖ ,గుంటూరులో 30 మెగావాట్ల రెండు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు నెల్లూరు, రాజమండ్రిలో రూ.700 కోట్లతో 22 మెగావాట్ల విద్యుత్ తయారుచేసే ప్లాంట్లు పెడుతున్నాం. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై ఉంది. అందులో 51 లక్షల చెత్త తొలగింపు పూర్తయింది. అక్టోబర్ 2 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేసేందుకు మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. 2027 నాటికి 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుతాం. ఒకప్పుడు మరుగుదొడ్లు ఉండేవి కాదు. మహిళల ఆత్మ గౌరవం పేరుతో కొత్తవి నిర్మించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లక్షల 60 వేల మరుగుదొడ్లు మంజూరు చేశాం. అందులో 72 వేల మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

Next Story